హైడ్రా విధానాలపై సుధీర్ రెడ్డి విమర్శలు
ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హైడ్రా కమిషనర్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశించడం పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చుతూ పెద్దల భూములను కాపాడుతున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు లక్షల కోట్ల రూపాయల ఆస్తులను రక్షించినట్లు రంగనాథ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దుర్గంచెరువులోని నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజ్, అలాగే హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్‌టీఎల్ పరిధిలోని నిర్మాణాలపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని, దీనిపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మందగించడానికి హైడ్రా విధానాలు కూడా ఒక కారణమని సుధీర్ రెడ్డి అన్నారు. హైడ్రాను బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా ఉపయోగించడం సరికాదని, ప్రభుత్వం రాజకీయాల కంటే పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం, మంత్రులు బీఆర్ఎస్‌ను విమర్శించడం మానేసి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు పలికారు.

