మేకేదాటు అంశంపై ప్రధానికి సిఎం విజయ్ లేఖ
తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు డ్యామ్ ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. రాజ్యసభలో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి.. కావేరీపై ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా దిగువ రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు 2018 తీర్పులో పేర్కొనలేదని చెప్పారు. దీనిపై సీఎం విజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించిన చట్టాలు, సుప్రీంకోర్టు గత తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఈ సమాధానం ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఆలమట్టి డ్యామ్ కేసుతో పాటు కావేరీ జల వివాద ట్రిబ్యునల్ తీర్పులు దిగువ రాష్ట్రాల హక్కులను స్పష్టంగా గుర్తించాయని పేర్కొన్నారు.
మేకేదాటు ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ అవార్డు, సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఉన్నప్పుడే అనుమతులు ఇవ్వాలని, అప్పటి వరకు ఎలాంటి పరిపాలనా లేదా చట్టపరమైన అనుమతులు మంజూరు చేయవద్దని ప్రధాని మోదీని సీఎం విజయ్ కోరారు. అలాగే, ఈ అంశంపై సమగ్ర చట్టపరమైన, సాంకేతిక పరిశీలన చేపట్టి దిగువ రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

