Home Page SliderNationalNewsNews Alert

ఆసుపత్రి నుండి నేరుగా రాజ్‌ఘాట్‌కు వాంగ్‌చుక్

పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆరు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో డాక్టర్లు ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే తన భార్య గీతాంజలి ఆంగ్మోతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ, అహింసా మార్గంలో ఉద్యమాలు సాగించేందుకు గాంధీజీ తనకు స్ఫూర్తినిచ్చారని చెప్పారు. లద్దాక్‌కు తిరిగి వెళ్లే ముందు గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు రాజ్‌ఘాట్‌కు వచ్చినట్లు వెల్లడించారు.

డిశ్చార్జ్‌కు ముందు విడుదల చేసిన వీడియోలో తాను ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నానని, శరీరం క్రమంగా బలాన్ని తిరిగి పొందుతోందని తెలిపారు. తన ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మెదాంతా ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో, డిశ్చార్జ్ సమయంలో వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన అప్రమత్తంగా ఉన్నారని పేర్కొంది. క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఫాలోఅప్ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు తెలిపింది.

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని, విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ జంతర్ మంతర్ వద్ద 26 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు.