సౌదీ యువరాజు మరణం వెనుక కారణం
సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ (29) గతేడాది లండన్‌లోని ఓ విలాసవంతమైన హోటల్లో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మరణంపై విచారణ జరిపిన ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ కోర్టు, ఇది హత్య లేదా ఆత్మహత్య కాదని, ప్రమాదవశాత్తు జరిగిన మరణమని స్పష్టం చేసింది.
గతేడాది నవంబర్ 19న లండన్‌లోని కెన్సింగ్టన్ మారియట్ హోటల్లో బసకు దిగిన యువరాజు, నవంబర్ 25న గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది తనిఖీ చేయగా బాత్రూమ్లో అపస్మారక స్థితిలో కనిపించారు. వైద్య సిబ్బంది ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సీసీటీవీ దృశ్యాల్లో మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు.
టాక్సికాలజీ నివేదిక ప్రకారం, యువరాజు రక్తంలో అధిక స్థాయిలో ఆల్కహాల్‌తో పాటు జీహెచ్‌బీ (GHB), కేనబిస్, జానాక్స్ వంటి పదార్థాలు ఉన్నట్లు తేలింది. వీటిని ఒకేసారి అధిక మోతాదులో తీసుకోవడంతో గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు వైద్య నిపుణులు కోర్టుకు వివరించారు. అనంతరం ఆయనకు రియాద్‌లో అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.

