విద్యార్థులపై దాడులు.. ప్రియాంక ఆగ్రహం
న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీక్ వివాదం, ‘చలో పార్లమెంట్’ నిరసనల సందర్భంగా విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆమె, విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. దేశ యువత సాధించే ప్రతి విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వ విజయంగా చెప్పుకుంటారని, అయితే విద్యార్థులపై జరిగిన దాడులకు కూడా అదే విధంగా బాధ్యత వహించాలని ప్రియాంక డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో విద్యార్థులపై ప్రేమ చూపిస్తున్నట్లు చెప్పే ప్రభుత్వం, హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపైనే లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం విచారకరమని వ్యాఖ్యానించారు.
హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారిపై ఇంటర్నెట్ నిలిపివేయడం, బలప్రయోగానికి దిగడం సరైన విధానం కాదన్నారు. క్రీడలు, విజ్ఞాన రంగాల్లో దేశం సాధించిన విజయాలకు క్రెడిట్ తీసుకునే కేంద్రం, తన పాలనలో జరిగిన పేపర్ లీక్ ఘటనలకు కూడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు.

