Home Page SliderNationalNewsNews Alert

విద్యార్థులకు కమల్ మద్దతు

దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల్లో అక్రమాల ఆరోపణలపై విద్యార్థులు చేపడుతున్న నిరసనలకు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ (CJP)’ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. దేశంలోని విద్యావ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక చిన్నారి బాధపడినప్పుడే స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని పేర్కొన్నారు. బోధన స్థానంలో కోచింగ్, జిజ్ఞాస స్థానంలో ఆందోళన, ప్రతిభ స్థానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు. విద్యార్థులకు సమాధానాల బదులు బారికేడ్లు, లాఠీలు ఎదురవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.

ఢిల్లీలో ‘చలో సంసద్’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించిన ఘటన నేపథ్యంలో కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. జూన్ 28 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఉద్దేశించి, దేశానికి ఆయన సేవలు అవసరమని, దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భారతీయ విద్యార్థులు తమ బాధ్యతను నిర్వర్తించారని, ఇప్పుడు దేశం వారి న్యాయమైన డిమాండ్లకు స్పందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. కమల్ హాసన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.