నీట్‌పై చర్చకు కేంద్రం ఓకే
న్యూఢిల్లీ – దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే సభా నిబంధనల ప్రకారమే చర్చ జరగాలని, సమయం, తేదీ నిర్ణయించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరినట్లు వెల్లడించారు. లోక్‌సభలో మాట్లాడిన రిజిజు.. దేశ యువత భవిష్యత్తుకు సంబంధించిన ఏ అంశంపైనైనా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్చకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. వీధుల్లో ఆందోళనల కంటే పార్లమెంట్లో చర్చ జరగడం సముచితమని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా స్పీకర్‌తో సమావేశమయ్యారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేశ్ యాదవ్ సహా పలువురు ప్రతిపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా ఈ నిరసన చేపట్టినట్లు ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

