152 లీకులు.. శిక్షలు శూన్యం: రాహుల్
దేశంలో గత పదేళ్లలో 152 పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయినప్పటికీ ఇప్పటివరకు ఒక్క బాధ్యుడికీ శిక్ష పడలేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ అవకతవకలు, పేపర్ లీకేజీలపై ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, దాదాపు ప్రతి నెలా ఒక పేపర్ లీక్ ఘటన చోటుచేసుకుందని రాహుల్ అన్నారు. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా సుమారు 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, విద్యార్థులపై దాడులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా వ్యవస్థ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని కోరారు.
విద్యార్థుల డిమాండ్లకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచాలని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకుండా సమగ్ర సంస్కరణలు చేపట్టాలని ఆయన కేంద్రాన్ని కోరారు.

