ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత
నీట్ పరీక్ష పత్రాల లీకేజీ అంశంపై కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలు, ప్రధాని నివాస ముట్టడి యత్నం నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) భద్రతా కారణాల దృష్ట్యా 16 కీలక మెట్రో స్టేషన్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆందోళనల సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లోక్ కల్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, జన్‌పథ్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం తదితర స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ సేవలను నిలిపివేశారు.
ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వంటి జంక్షన్ స్టేషన్లలో ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారేందుకు మాత్రం అనుమతి ఇచ్చారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని డీఎంఆర్సీ ప్రయాణికులకు సూచించింది.

