తమ్మినేని కుటుంబంపై పోలీసు కేసు
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై భూ ఆక్రమణ, ఫోర్జరీ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు చూపిస్తూ కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలపై శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాపురం ప్రాంతానికి చెందిన గోవిందరాజులుకు సుమారు రూ.4 కోట్ల విలువైన 900 గజాల స్థలం ఉంది. ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు నిందితులు గోవిందరాజులు బతికుండగానే ఆయన మరణించినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వారసత్వ పత్రాలను ఫోర్జరీ చేసి ఆమదాలవలస సబ్- రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితుడి అల్లుడు కనకలింగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అదేవిధంగా నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారనే ఆరోపణలపై అప్పటి ఆమదాలవలస సబ్- రిజిస్ట్రార్ అరుణపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ భూ వివాదంపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

