నాలుగో అంతస్తు నుంచి బాలిక పడి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో నాలుగో అంతస్తు నుంచి కిందపడిన ఘటన విషాదంగా మారింది. తీవ్రంగా గాయపడిన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ కేసులో 30 ఏళ్ల షానావాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, నిందితుడు కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడు. ఇటీవల అతడిని చెంపదెబ్బ కొట్టిన బాలికపై కక్ష పెంచుకుని, జులై 15న రాత్రి ఆమెను బలవంతంగా భవనం పై అంతస్తుకు తీసుకెళ్లి కిందకు తోసేశాడని ఆరోపించారు.
తీవ్ర గాయాలతో బాలికను ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే బాలికను తాను తోసివేయలేదని షానావాజ్ పోలీసులకు తెలిపాడు. తాను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, బాలిక స్వయంగా పై అంతస్తుకు వెళ్లిందని, ప్రమాదవశాత్తు జారి కిందపడిందని వాంగ్మూలం ఇచ్చాడు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

