Andhra PradeshBreaking NewsHome Page SliderNews

తల్లికి వందనంపై షర్మిల విమర్శలు

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె, ఎన్నికల హామీలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ‘అమ్మఒడి’ పథకంలో ఒక్క బిడ్డకే లబ్ధి కల్పించిందని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు తాను అదే తరహా విధానాన్ని అనుసరిస్తున్నారని షర్మిల అన్నారు. ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి, ఇప్పుడు పరిమితులు విధించడం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉండగా, కేవలం 67 లక్షల మందికే పథకం వర్తింపజేస్తున్నారని, మిగిలిన వారికి అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. అలాగే పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2 వేల కోత విధించడం కూడా సరికాదన్నారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి పథకం వర్తింపజేసి, పూర్తిగా రూ.15 వేల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.