Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews Alert

స్థానిక ఎన్నికలకు జనసేన సిద్ధం

తెనాలి: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలం ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా పోటీ చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలో మీడియాతో మాట్లాడిన ఆయన, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అమలైన సీట్ల సర్దుబాటు ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదని స్పష్టం చేశారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే లక్ష్యంతో గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి కోసం రాజీ పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే అదే విధానం స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగుతుందని భావించడం సరికాదన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు, సీట్ల కేటాయింపులపై ఎన్డీయే కూటమి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్థానిక పరిస్థితులు, పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు, స్థానాలపై నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కూటమి భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు సిద్ధం కావాలని జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు.