Andhra PradeshHome Page SliderNews Alert

మెనూ, పరిశుభ్రతపై మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఫోకస్

అమరావతి : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, నాణ్యమైన ఆహారంపై ఎలాంటి రాజీ పడకూడదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో శాఖ డీడీలు, డీసీవోలు, ఏఎస్‌డబ్ల్యూవోలతో హాస్టళ్ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై వారి తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వార్డెన్లు, ప్రిన్సిపాళ్లు విద్యార్థులతో ప్రేమగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చిన్న సమస్య కూడా తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు. హాస్టళ్లలో పరిశుభ్రత కోసం తొలిసారిగా అవుట్‌సోర్సింగ్ విధానంలో శానిటేషన్ సిబ్బందిని నియమించామని, స్వచ్ఛమైన తాగునీటి కోసం అన్ని హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే విద్యార్థులకు మెరుగైన పోషకాహారం అందించేందుకు డైట్ చార్జీలను 10 శాతం పెంచినట్లు వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు విద్యార్థులకు సమర్థంగా అందేలా అధికారులు పనిచేయాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.