Home Page SliderInternationalNewsNews Alert

ఇరాన్ అణుకేంద్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని ‘పిక్‌యాక్స్ మౌంటెన్’ అణు కేంద్రం అమెరికా లక్ష్యాల జాబితాలోనే ఉందని, ఆ కేంద్రాన్ని నిరంతరం నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. అవసరమైతే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చారు. వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ, స్పేస్ ఫోర్స్‌తో పాటు ఇతర నిఘా వ్యవస్థల ద్వారా ఆ కేంద్రంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ అనుమానాస్పద కదలికలు కనిపించడం లేదని పేర్కొన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకోవడంలో అమెరికా తన వైఖరిని మార్చబోదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్‌తో అణు ఒప్పందం దాదాపు ఖరారయ్యే దశలో ఆ దేశమే వెనక్కి తగ్గిందని ఆరోపిస్తూ, ఒప్పందాలను ఉల్లంఘించడం ఇరాన్‌కు అలవాటేనని విమర్శించారు.

ఇరాన్‌కు అణ్వాయుధాలు లభిస్తే ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. అయితే ఇరాన్ నాయకత్వంపై తీసుకునే చర్యల వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

అదే సమయంలో దౌత్య చర్చలకు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదని, ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశం ఇంకా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించడంలో అమెరికా తన కఠిన వైఖరిని కొనసాగిస్తుందని మరోసారి స్పష్టం చేశారు.