Home Page SliderNationalNewsNews AlertTrending Today

యూసీసీ పరిశీలనకు 9 మంది కమిటీ

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లు- 2026 ముసాయిదాను పరిశీలించి, అవసరమైన మార్పులు సూచించేందుకు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ముసాయిదా బిల్లును సమగ్రంగా అధ్యయనం చేసి తమ సిఫార్సులను సమర్పించే బాధ్యత కమిటీకి అప్పగించారు. కమిటీ నివేదిక ఆధారంగా బిల్లును తుది రూపంలో సిద్ధం చేసి, ఆగస్టులో జరిగే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

కమిటీలో మేఘాలయ మాజీ గవర్నర్ తథాగత రాయ్, రాష్ట్ర హోం సెక్రటరీ సంఘమిత్ర ఘోష్, న్యాయవాది ఉస్మాన్ గని మల్లిక్‌తో పాటు పలువురు మాజీ అధికారులు, విద్యావేత్తలు సభ్యులుగా ఉన్నారు.

జులై 2న రాష్ట్ర మంత్రివర్గం యూసీసీ ముసాయిదాకు ఆమోదం తెలిపిన అనంతరం, నిపుణుల కమిటీ సూచనల ఆధారంగా బిల్లును ముందుకు తీసుకెళ్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మతాల వారీగా అమల్లో ఉన్న వ్యక్తిగత చట్టాల స్థానంలో ఒకే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడమే ఈ బిల్లు లక్ష్యమని తెలిపింది.

అయితే గిరిజనులు, ఆదివాసీలు, కుర్మీలు, ఇతర గుర్తింపు పొందిన ప్రాచీన గిరిజన వర్గాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాన్నే ఇందుకు అనుసరిస్తున్నట్లు పేర్కొంది. కమిటీ సిఫార్సులు అందిన తర్వాత బిల్లును తుది రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.