అయోధ్యలో అమితాబ్ పెట్టుబడులు..
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముందుచూపుతో పెట్టుబడులు పెడుతూంటారు. భవిష్యత్ ఆలోచనలతో ఆయన పెట్టే పెట్టుబడులు ఇప్పటికే కోట్ల రూపాయలు తెచ్చిపెట్టాయి. ఇటీవల శ్రీరామ జన్మభూమి అయోధ్యలో ఆయన రెండుసార్లు భూమిని కొనుగోలు చేశారు. గతేడాది జనవరిలో అయోధ్యలోని హవేలి అవధ్‌లో భూమిని రూ.4.54 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ ప్రదేశానికి కేవలం 10 నిమిషాల దూరంలో శ్రీరామాలయం, 20 నిమిషాల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడం గమనార్హం. తాజాగా మరో 55 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిని కూడా రూ. 87 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనిని తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం కొన్నట్లు పేర్కొన్నారు. ఇది కూడా రామ మందిరానికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తాజాగా అమితాబ్ బచ్చన్ కల్కి, వేట్టైయాన్ సినిమాలలో కనిపించారు. ప్రస్తుతం రామాయణ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే కౌన్ బనేగా కరోడ్ పతి తర్వాతి సీజన్‌కు సిద్ధమవుతున్నారు.