సాయికృష్ణ కుటుంబానికి రూ.20 లక్షలు
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. తన కుమారుడు అదృశ్యమయ్యాడంటూ తల్లి విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించగా, విచారణలో ఇది లాకప్ డెత్ అని, దీనికి కృష్ణలంక సీఐ నాగరాజే బాధ్యుడని తేలింది. ఈ కేసులో సీఐను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే సాయికృష్ణ మృతదేహం ఆచూకీ ఇప్పటికీ లభించలేదు.
తన కుమారుడి మృతదేహం లేదా కనీసం అస్థికలైనా అప్పగించాలని విజయలక్ష్మి కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని ఆమె నివాసానికి వెళ్లి పరామర్శించారు.
ఈ సందర్భంగా వైసీపీ తరఫున బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాయికృష్ణ లాకప్ డెత్ అత్యంత దారుణ ఘటన అని పేర్కొన్న నేతలు, బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
నిందితులకు కఠిన శిక్ష పడే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని, బాధితురాలికి అన్ని విధాలా సహాయం అందిస్తామని తెలిపారు. అలాగే సాయికృష్ణ మృతదేహం లేదా అస్థికల ఆచూకీ కనుగొని కుటుంబానికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

