రూ.2 లక్షలు, స్మార్ట్‌ఫోన్.. సిట్ విచారణ
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఆలయ విరాళాల సొమ్ముతో విలాసవంతమైన బహుమతులు కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిట్ దర్యాప్తులో ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ.15 లక్షలకు పైగా డిజిటల్, నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ మొత్తం ఆలయ విరాళాలకు సంబంధించినదేనా అనే కోణంలో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా అవినాష్ తన స్నేహితురాలికి రూ.2 లక్షల నగదుతో పాటు ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై కూడా సిట్ ఆరా తీస్తోంది.
ఈ కేసులో అవినాష్ సోదరుడు అభిషేక్ శుక్లా పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. ఆలయ విధులు ముగిసిన తర్వాత అవినాష్ తరచూ పెద్ద మొత్తంలో నగదు తీసుకుని యోగా కేంద్రానికి వెళ్లేవాడని తెలిపాడు. ఆ డబ్బు గురించి ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం చెప్పలేదని వెల్లడించాడు. మరో నిందితుడు అనుకల్ప్ మిశ్రను అడిగితే, అది భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బు అని చెప్పి, ఈ విషయంపై మళ్లీ ప్రశ్నించవద్దని హెచ్చరించినట్లు అభిషేక్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
విరాళాల చోరీ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో అయోధ్య రామమందిర ట్రస్ట్ అప్రమత్తమైంది. ఈ అంశంపై చర్చించేందుకు ట్రస్ట్ సభ్యులు సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సిట్ అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసి, ఆర్థిక లావాదేవీలతో పాటు ఇతర ఆధారాలను సేకరిస్తోంది. కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

