ఆక్వా రైతులను పరామర్శించనున్న జగన్
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో నష్టపోతున్న ఆక్వా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వైఎస్సార్సీపీ తరఫున రైతులకు అండగా నిలుస్తామని ఈ సందర్భంగా భరోసా ఇవ్వనున్నారు.
ఈ విషయాన్ని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారిందని, ప్రభుత్వం రైతుల కంటే ఫీడ్ వ్యాపారుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించిన విద్యుత్ సబ్సిడీని రద్దు చేయడంతో రైతులపై అదనపు భారం పడిందన్నారు. అలాగే ఫీడ్ ధరలు వరుసగా పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని, అంతర్జాతీయ మార్కెట్లలో ఎగుమతుల సమస్యల పరిష్కారంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం ఫీడ్ ధరలు తగ్గించాలని రైతులు పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించలేదని ప్రసాదరాజు అన్నారు. ఫీడ్ ధరను రూ.14 పెంచి, తర్వాత కేవలం రూ.2 మాత్రమే తగ్గించడం రైతులకు ఎలాంటి ఉపశమనం కాదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు ‘క్రాప్ హాలిడే’ ప్రకటించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారని ప్రసాదరాజు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.

