Home Page SliderInternationalNewsNews Alert

అంటార్కిటికాలో డైనోసార్ శిలాజం

అంటార్కిటికాలో 8.2 కోట్ల సంవత్సరాల నాటి టైటానోసార్ డైనోసార్ శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశేషమేమిటంటే, ఈ శిలాజం 1985లోనే లభించినప్పటికీ, దాని ప్రాధాన్యం గుర్తించక లండన్‌లోని ఓ ల్యాబ్‌లో సాధారణ సముద్ర జీవి ఎముకగా భావించి దశాబ్దాల పాటు భద్రపరిచారు.

బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన భూగర్భ శాస్త్రవేత్త మైక్ థామ్సన్ జేమ్స్ రాస్ ఐలాండ్‌లో ఈ ఎముకను సేకరించారు. తాజాగా జరిగిన అధ్యయనంలో ప్రముఖ శిలాజ శాస్త్రవేత్తలు మార్క్ ఎవాన్స్, పాల్ బారెట్ పరిశీలించి, ఇది టైటానోసార్ తోక ఎముక అని నిర్ధారించారు. ఈ పరిశోధన వివరాలు ఆక్టా పలేయోంటోలాజికా పొలోనికా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సుమారు 10 సెంటీమీటర్ల పొడవున్న ఈ ఎముకలో కనిపించిన ప్రత్యేక ‘బాల్ -అండ్- సాకెట్’ నిర్మాణం టైటానోసార్‌ల ప్రత్యేక లక్షణమని శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాజం అసంపూర్తిగా ఉండటంతో ఖచ్చితమైన జాతిని గుర్తించలేకపోయినా, ఇది సుమారు 23 అడుగుల పొడవున్న చిన్న వయసు డైనోసార్‌దిగా భావిస్తున్నారు.

మిలియన్ల ఏళ్ల క్రితం అంటార్కిటికా మంచు ఖండం కాకుండా పచ్చని అడవులతో నిండి, డైనోసార్ల జీవనానికి అనుకూలంగా ఉండేదని పరిశోధకులు తెలిపారు.