Breaking NewsHome Page SliderNewsTelangana

తెలంగాణ కాంగ్రెస్‌పై నితిన్ నబిన్ విమర్శలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్‌లో సోమవారం నిర్వహించిన గిరిజన నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు.

రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

గిరిజన సంక్షేమానికి బీజేపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని నితిన్ నబిన్ తెలిపారు. యూపీఏ హయాంలో గిరిజన సంక్షేమానికి రూ.4 వేల కోట్లు మాత్రమే కేటాయించగా, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం రూ.15 వేల కోట్లు వెచ్చించిందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా మద్దతు ఇచ్చిందని, పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని, బీజేపీ ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించి సత్కరించిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన నితిన్ నబిన్, కాంగ్రెస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు.