డివైడర్ను ఢీకొట్టి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామం సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ముందుగా రోడ్డు డివైడర్ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కళ్లెం శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన ఉప్పల్ గ్రామంలో ఉన్న స్నేహితుడిని కలిసి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానికుల సహాయంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? లేదా మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఉప్పల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

