Home Page SliderNationalPolitics

కటకటాల్లోకి ..పంజాబ్ మంత్రిసంజీవ్ అరోరా

చండీగఢ్ (ఏడీఎన్ఎన్):
మొబైల్ ఫోన్ల ట్రేడింగ్ పేరిట నకిలీ కంపెనీలను సృష్టించి, సుమారు రూ. 100 కోట్లకు పైగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ అరోరాకు పీఎంఎల్ఎ ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీ ముగియడంతో సోమవారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. షెల్ కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు గుర్తించారు. మొబైల్ ఫోన్ల వ్యాపారం ముసుగులో బోగస్ (షెల్) కంపెనీలను ఏర్పాటు చేసి, వంద కోట్ల రూపాయల మేర నకిలీ జీఎస్టీ బిల్లింగ్, మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు మంత్రి సంజీవ్ అరోరాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కొన్ని నకిలీ సంస్థలతో ఆయనకు ఉన్న అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను ఈడీ అధికారులు గుర్తించారు. దీనిపై పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం మే 9వ తేదీన చండీగఢ్‌లో మంత్రిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించిన లింకులను ఛేదించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే రంగంలోకి దిగింది. ఢిల్లీ, చండీగఢ్, గురుగావ్, దాని పరిసర ప్రాంతాల్లోని కీలకమైన స్థావరాలపై ఈడీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాతే మంత్రిని కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారిగా మంత్రి సంజీవ్ అరోరాను ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ప్రాంగణంలోనే కలుసుకున్నారు. ఈ కేసు తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. పంజాబ్‌లో ఒక సిట్టింగ్ మంత్రి ఇలా వంద కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో చిక్కుకుని జైలు పాలు కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది.