సీఎం రేవంత్ రెడ్డి ‘విజన్ 2047’ ప్రణాళిక భేష్
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని, తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. నగరీకరణ వల్ల ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్రాన్ని క్యూర్ , ప్యూర్, రేర్ అనే మూడు విభాగాలుగా వర్గీకరించి అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు తయారీ రంగానికి, ఆపై ఉన్న గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేవలం రోడ్ల విస్తరణకే పరిమితం కాకుండా.. అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీ లెవల్ పార్కింగ్ వంటి బహుళ విధానాలను అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని, ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్‌లో ఆటోలకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీలుగా మార్చాలనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా నగరానికి కొత్త అందాలను అద్దడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని వివరించారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని ఆయన కమిటీకి స్పష్టం చేశారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని ప్రశంసించారు. ముఖ్యంగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును దేశంలోనే అత్యుత్తమమైనదిగా అభివర్ణిస్తూ, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని కొనియాడారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా కమిటీ అభినందించింది. నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు చూపిన అభివృద్ధి ప్రణాళికలు చూసి కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు సీఎం కమిటీ సభ్యులను సన్మానించి, విజన్ డాక్యుమెంట్‌ను అందజేశారు.

