విజయుడికే పట్టాభిషేకం
తమిళనాడు రాజకీయాల్లో ‘విజయ్’శకం ఆరంభమైంది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాల ముద్రను చెరిపేస్తూ తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. శనివారం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు ‘దళపతి’ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మేజిక్ ఫిగర్ దాటిన టీవీకే
తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సమీకరణాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ (5), సీపీఎం (2), సీపీఐ (2),లతో పాటు విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే 2), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్2) పార్టీలు విజయ్‌కి బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ కూటమి బలం 120కి చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 118 కంటే ఎక్కువ మద్దతు ఉండటంతో విజయ్ తన వద్ద ఉన్న 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు సమర్పించారు. దీంతో గవర్నర్ అధికారికంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు.
నేడే విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 15 నిముషాలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి దక్షిణ భారత సినీ ప్రముఖులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుక కోసం అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బేషరతుగా వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలు ఉండగా, ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా 108 స్థానాలు గెలుచుకుంది. అయితే విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీనితో పార్టీ బలం 107కు పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో ఇన్నాళ్లూ ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగింది. ఈ నేపథ్యంలో శనివారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసీకే వ్యవస్థాపకుడు తోల్ తిరుమావళవన్ తమ పార్టీ మద్దతు లేఖను టీవీకే ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జునకు అందజేశారు. అంతకుముందు వరకు ఉపముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన వీసీకే, చివరకు రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ఎటువంటి షరతులు లేకుండా విజయ్‌కు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. వీసీకే మద్దతుతో టీవీకే బలం మ్యాజిక్ ఫిగర్ 118కి చేరుకుంది. ఈ పరిణామం జరిగిన వెంటనే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా విజయ్‌కే జై కొట్టారు. దీంతో టీవీకే కూటమి బలం 120కి పెరిగింది.

