BusinessInternational

అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర.. స్పేస్-టెక్ యూనికార్న్‌గా స్కైరూట్!

భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) సరికొత్త మైలురాయిని చేరుకుంది. తాజా నిధుల సమీకరణతో ఈ స్టార్టప్ విలువ 1 బిలియన్ డాలర్ల (సుమారు ₹8,400 కోట్లకు పైగా) మార్కును దాటినట్లు సమాచారం. దీంతో దేశంలోనే ఈ ఘనత సాధించిన మొదటి స్పేస్-టెక్ ‘యూనికార్న్’గా స్కైరూట్ చరిత్ర సృష్టించింది.

ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా 2018లో ఈ సంస్థను స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.2022లో ‘విక్రమ్-ఎస్’ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి, అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపిన తొలి భారతీయ ప్రైవేట్ సంస్థగా నిలిచింది.

గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్తలు స్కైరూట్ సాంకేతికతపై నమ్మకంతో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం పూర్తిస్థాయి వాణిజ్య రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగానికి సంస్థ సిద్ధమవుతోంది. తక్కువ ఖర్చుతో శాటిలైట్లను కక్ష్యలోకి పంపడమే వీరి ప్రధాన ఉద్దేశం.

ఈ విజయం కేవలం స్కైరూట్‌కే కాకుండా, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన అంతరిక్ష సంస్కరణలకు (Space Reforms) దక్కిన విజయంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో భారత్ వాటాను పెంచడంలో ఈ స్టార్టప్ కీలక పాత్ర పోషించనుంది.