Home Page Sliderhome page sliderNationalPolitics

దీదీకి షాక్!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని మమతా బెనర్జీ స్పష్టం చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓటమి భారంతో ఇప్పటికే డీలా పడిన తృణమూల్ కాంగ్రెస్‌కు తాజాగా సొంత ఎమ్మెల్యేల వ్యవహారం మింగుడు పడటం లేదు. పార్టీ భవిష్యత్తుపై చర్చించేందుకు దీదీ నిర్వహించిన కీలక సమావేశానికి పది మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున మొత్తం 80 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ఈ అత్యవసర సమావేశానికి కేవలం 70 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. పది మంది సభ్యులు గైర్హాజరు కావడంతో పార్టీలో అసమ్మతి జ్వాలలు మొదలయ్యాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారం కోల్పోయిన తరుణంలో ఈ పరిణామం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో పార్టీ పట్టు కోల్పోయిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ భేటీని నిర్వహించారు. అయితే పది మంది ఎమ్మెల్యేలు రాకపోవడం టీఎంసీలో చీలిక వస్తుందనే ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఫిరాయింపులు జరుగుతాయనే భయంతో పార్టీ నాయకత్వం అప్రమత్తమై అంతర్గత విచారణ జరుపుతోంది. ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం వివరణ ఇచ్చింది. పార్టీలో ఎటువంటి చీలికలు లేవని, ఎమ్మెల్యేల గైర్హాజరుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేసింది. సమావేశానికి రాలేని వారు వ్యక్తిగత కారణాల వల్ల ముందే సమాచారం అందించారని టీఎంసీ వర్గాలు స్పష్టం చేశాయి.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రద్దు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7వ తేదీతో ముగియడంతో, గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా గడువు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అసెంబ్లీ రద్దుపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈనెల 9న పశ్చిమ బెంగాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసి, నూతన పాలన దిశగా అడుగులు పడుతున్నాయి.