Home Page SliderInternationalPolitics

నేపాల్‌లో 1,500 మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

నేపాల్‌లో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం కీలక నిర్ణయంతో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన సుమారు 1,500 రాజకీయ నియామకాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలో నాయకత్వ మార్పు సంభవించిన గత మార్చి 26వ తేదీకి ముందు జరిగిన నియామకాలన్నీ చెల్లకుండా పోతాయని ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేసింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు , తాత్కాలిక ప్రభుత్వాల హయాంలో అర్హతలతో సంబంధం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ నియామకాలు చేపట్టారనే విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

నేపాల్‌లో ఇటీవల ‘జెన్‌జీ’ యువత చేపట్టిన భారీ నిరసనల తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. గత మార్చి 5న జరిగిన ఎన్నికల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ’ ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టింది. పరిపాలనలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా కొత్త ప్రభుత్వం ఈ ప్రక్షాళన చర్యకు పూనుకుంది. రద్దు చేసిన పదవుల్లో వివిధ ప్రభుత్వ సంస్థల బోర్డు సభ్యులు, సలహాదారులు ఇతర కీలక రాజకీయ పదవులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం దేశ కార్యకలాపాల్లో కొత్త మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు విశ్లేషిస్తుండగా, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.