Andhra PradeshHome Page SliderNews AlertPolitics

విద్యాశాఖలో లోకేష్ మార్పులు అద్భుతం: హోం మంత్రి అనిత

అమరావతి: రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధిస్తున్న అద్భుత విజయాలను అభినందిస్తూ, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా పత్రికా ప్రకటనల ద్వారా వారిని ప్రోత్సహించడం శుభపరిణామమని శుక్రవారం ఆమె పేర్కొన్నారు. మంత్రి లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన ‘100 రోజుల ప్రణాళిక’ క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి అనిత కొనియాడారు. ముఖ్యంగా ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా నిలవడం గర్వకారణమని ఆమె అన్నారు. గత ఐదేళ్ల పాలనలో వెనుకబడిన విద్యా రంగాన్ని పునరుద్ధరించి, విద్యార్థులకు ‘అమ్మలా శిక్షణ, నాన్నలా రక్షణ’ అందించేలా లోకేష్ తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.