Home Page SliderPoliticsTelangana

రైతులను నట్టేట ముంచుతారా?

రాష్ట్రంలోని అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. తాలు, తరుగు లేకుండా వడ్లు కొంటామన్న మాట ఏమైందని ప్రశ్నించిన ఆయన, మద్దతు ధర విషయంలో ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. వడ్లకు బోనస్ హామీని అటకెక్కించారని, గత రబీ సీజన్‌తో పాటు ఈ సీజన్‌లోనూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నా సమ్మర్ యాక్షన్ ప్లాన్ లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అల్లాడుతున్నా విపత్తు నిర్వహణ శాఖ నిద్రపోతోందని చురకలంటించారు. వరంగల్ డిక్లరేషన్, రాయపూర్ తీర్మానాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందని ఎద్దేవా చేశారు. కరప్షన్, కలెక్షన్లు, ల్యాండ్ సెటిల్‌మెంట్లపై ఉన్న శ్రద్ధ రైతుల కన్నీళ్లపై లేదని దుయ్యబట్టారు. వెంటనే రైతుల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డిని బండి సంజయ్ హెచ్చరించారు.