Breaking NewsHome Page Sliderhome page sliderTelangana

ఏదేమైనా ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాకు నీరు అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ నల్గొండ అంటే పోరాటాల పురిటి గడ్డ అని అన్నారు . నిజం నిరంకుశ పాలనను ఎదిరించిన జిల్లా నల్గొండ అని రేవంత్ పేర్కొన్నారు . ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచిన అందరికీ సీఎం ధన్యవాదాలు తెలియజేసారు .

 గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఒక్క రేషన్‌ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు .రేషన్‌ కార్డులపై పేదలందరికీ సన్నబియ్యం ఇస్తున్నామని , పేదల ఆకలి తీర్చినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యమని సీఎం పేర్కొన్నారు . దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని సీఎం తెలిపారు . గుజరాత్‌ సహా దేశంలో మరే రాష్ట్రంలోనూ సన్న బియ్యం ఇవ్వట్లేదని అన్నారు . యూపీఏ ప్రభుత్వ హయాములో రాష్ట్రంలో 25లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరిగిందని , గత పదేళ్లలో కేసీఆర్ ఎంతమంది పేదలకు ఇళ్లు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే 4.50లక్షల ఇళ్లు పేదలకు మంజూరు చేశామని , లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్లు కలిపించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ పేర్కొన్నారు .

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 25లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసిందని తెలిపారు . రుణమాఫీ పేరిట పదేళ్లపాటు రైతులను కేసీఆర్‌ మోసం చేశారని సీఎం విమర్శించారు . గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా కేసీఆర్‌ కలిసేవారు కాదని , ప్రగతి భవన్‌, ఫామ్‌హౌజ్‌లోకి ఎవ్వరినీ రానివ్వలేదని గుర్తుచేశారు .  కానీ, నిన్న ఇద్దరు సర్పంచ్‌లను కూర్చోబెట్టుకుని మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని చెబుతున్నారని , కేసీఆర్‌ ఓడిపోయాకే రాష్ట్రానికి, ప్రజలకు మేలు జరుగుతోందని సీఎం పేర్కొన్నారు . కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసిన ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కేసీఆర్‌ పదేళ్లపాటు పట్టించుకోలేదని , ఈ ప్రభుత్వ హయాంలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు . ఎస్‌ఎల్‌బీసీ పనులు ప్రారంభించగానే సొరంగంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిందని , సొరంగంలో ప్రమాదం జరిగితే భారత రాష్ట్ర సమితి నేతలు సంబరపడ్డారని సీఎం విమర్శించారు . ఏదేమైనా టన్నెల్‌ను పూర్తి చేసి నీరు అందిస్తామని సీఎం అన్నారు.