విమాన ప్రమాద స్థలానికి ప్రధాని మోదీ
అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది చనిపోయారు. వైద్య కళాశాల సముదాయంపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. విమానం కూలిన ప్రదేశానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని ప్రధాని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి తదితరులు ఉన్నారు. మరోవైపు ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగీలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఒక్క ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడ్డారు. గుజరాత్ మాజీ సీఎం, భాజపా నేత విజయ్ రూపాణీ కూడా ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఇక, ఈ విమానం బీజే వైద్య కళాశాల మెడికోల వసతి గృహ సముదాయంపై కూలిన సంగతి తెలిసిందే. దీంతో అందులోని 24 మంది మృత్యువాత పడ్డారు. విమానంలో 169 మంది భారత పౌరులు కాగా.. 53 మంది బ్రిటన్ వాసులు, ఇతర విదేశీయులు ఉన్నారు.

