Home Page SliderHoroscope TodayNationalPolitics

అక్రమ వలసదారులకు కేంద్రం చెక్

దేశంలో అక్రమ వలసలు, ఇతర కారణాల వల్ల చోటుచేసుకుంటున్న అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ఆధారంగా, ఒక రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో ఈ కమిటీని నియమించినట్లు ఆయన వెల్లడించారు. ఈ జనాభా మార్పుల సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, ఆదివాసీ సమాజాల పరిరక్షణకు ఒక పెద్ద సవాలుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఉన్నత స్థాయి కమిటీకి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావోలేకర్‌ అధ్యక్షత వహిస్తారని హోం మంత్రి తెలిపారు. ఇందులో సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి ఉంటారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న జనాభా మార్పులపై సమగ్ర మూల్యాంకనం నిర్వహించడంతో పాటు.. మత, సామాజిక వర్గాల స్థాయుల్లో మారుతున్న జనాభా సరళిని లోతుగా విశ్లేషించడం ఈ కమిటీ యొక్క ముఖ్య విధి అని అమిత్‌షా స్పష్టం చేశారు.

దేశంలో వేగంగా మారుతున్న జనాభా తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి, సరిహద్దుల గుండా జరుగుతున్న చొరబాట్లను సమర్థవంతంగా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పూర్తి స్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా భవిష్యత్తులో దేశ భద్రత, సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.