తెలంగాణకు వర్షం ముప్పు!
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా తన రూపు మార్చుకుంది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు సెగలు కక్కుతూ తీవ్రమైన ఎండను అందించగా, ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై చల్లబడింది. ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ మార్పు కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 నుంచి 3 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉంది. ఈ సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని హెచ్చరించింది. తెలంగాణలో ఏర్పడిన ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. దీనివల్ల శుక్రవారం కూడా నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత మాత్రం తగ్గకపోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి వర్షం కురిసినా, ఎండ వేడి నుంచి పూర్తిగా విముక్తి లభించకపోవచ్చు.

