కేజ్రీవాల్ పైఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరో న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు విచారణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను ఢిల్లీ హైకోర్టు గురువారం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ జస్టిస్ ఎస్‌కే శర్మ నేతృత్వంలోని ధర్మాసనం కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.
సాధారణంగా న్యాయస్థాన విచారణల వీడియోలను ముందస్తు అనుమతి లేకుండా బహిరంగంగా పంచుకోవడం కోర్టు నిబంధనల ప్రకారం ఉల్లంఘన కిందకు వస్తుంది. అయితే కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక న్యాయవాది వాదనలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను పోస్ట్ చేయడంతో హైకోర్టు దీనిని తీవ్రంగా పరిగణించింది. తక్షణమే ఆ వివాదాస్పద వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు కేసులతో న్యాయపోరాటం సాగిస్తున్న కేజ్రీవాల్‌కు, ఇప్పుడు నేరుగా హైకోర్టు నుంచే ధిక్కరణ నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి, కోర్టు నిబంధనల పట్ల అవగాహన ఉండీ ఇలాంటి చర్యకు పాల్పడటంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోటీసులపై కేజ్రీవాల్ ఇచ్చే వివరణ ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

