అమెరికా సైనికుల ఆకలి కేకలు
ప్రపంచాన్నే గడగడలాడించే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన వీర సైనికులు ఆకలితో అలమటిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో మోహరించిన వేలాది మంది అమెరికా సైనికులకు సరైన ఆహారం అందడం లేదనే వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ప్లేటులో ఒక మూలన రెండు పలచటి చపాతీలు, కొన్ని ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధ విధుల్లో ఉన్న సైనికులకు ఈ చాలీచాలని ఆహారమే దిక్కవుతోందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హర్మూజ్ జలసంధి దిగ్బంధనంలో పాల్గొంటున్న యూఎస్‌ఎస్ ట్రిపోలి, యూఎస్‌ఎస్ అబ్రహాం లింకన్ వంటి భారీ యుద్ధ నౌకల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.కేవలం ఆహారమే కాకుండా ఇతర మౌలిక వసతుల పరంగానూ సైనికులు నరకం చూస్తున్నారు. గత నెల 27న 3,500 మంది మెరైన్లతో ఇరాన్ సరిహద్దులకు వెళ్లిన ట్రిపోలి నౌకతో పాటు, అబ్రహాం లింకన్ నౌకలోనూ నాణ్యమైన భోజనం లభించడం లేదు.

