ప్రభుత్వ పాఠశాలలో మంచినీటి శుద్ధి ప్లాంట్ల ప్రారంభం
విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రభుత్వ పాఠశాలలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. కైండ్ వేవ్స్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాఠశాలలో కొత్తగా తాగునీటి శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ వేడుక ఎంతో ఉత్సాహంగా సాగింది. సుమారు ₹1.6 లక్షల ఖర్చుతో రెండు భారీ నీటి శుద్ధి ప్లాంట్లను సీఎస్ఆర్ పంఢ్స్ ద్వారా నిర్మించారు. ఇవి ‘అల్ట్రా ఫిల్ట్రేషన్’, ‘యాక్టివేటెడ్ కార్బన్’ వంటి అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తాయి. ఇందులో ఒకటి ప్రాథమిక పాఠశాల కోసం, మరొకటి ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుంద ప్రతాప్ విచ్చేశారు. ప్లాంట్లను ప్రారంభించిన ఆయన, “స్వచ్ఛమైన నీరు అందడం ప్రతి విద్యార్థి హక్కు” అని అన్నారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే దేశానికి బలమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసిన ప్రతినిధి రామకృష్ణను ఆయన అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కే. గీత మాట్లాడుతూ, కైండ్ వేవ్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్లాంట్ల వల్ల విద్యార్థులకు నీటి ద్వారా వచ్చే జబ్బులు తగ్గుతాయని, వారు చదువుపై బాగా దృష్టి పెట్టగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. “జలం జీవితం – స్వచ్ఛమైన నీరు ఆరోగ్యానికి మూలం” అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగింది. కార్పొరేట్ సంస్థల సహకారం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఎలా అభివృద్ధి చెందుతాయో ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. ఈ వేడుకలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

