InternationalNationalNews Alert

కామన్వెల్త్ క్రీడల్లో మెరిసిన మేటి భారత మహిళలు వీళ్లే

Share with

ప్రతీ నాలుగేళ్లకొకమారు జరిగే ఆటల పండుగ కామన్వెల్త్ క్రీడలు. ఈ ఏటి పోటీలలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదేంటంటే ఈసారి పురుషులకు సమానంగా మహిళలు కూడా దాదాపు అన్ని క్రీడలలో తమ సత్తా చాటారు. బాడ్మింటన్ నుండి బాక్సింగ్ దాకా ప్రతీ క్రీడలో ఆఖరుకు నూతనంగా ప్రవేశపెట్టిన క్రీడల్లో కూడా పతకాల పంటలు పండించారు. మరి మనదేశ ప్రతిష్ఠాత్మక మహిళా శక్తుల గురించి చెప్పుకుందామా….

ముందుగా మన హైదరాబాద్ గర్వకారణం మన పీవీ సింధు గురించి చెప్పుకుంటే 2014లో కాంస్యం, 2018లో రజతం సాధించిన ఆమె పట్టిన పట్టు విడువకుండా ఈసారి పసిడి పతకాన్నే ఒడిసిపట్టింది. ఇది తన ఎన్నో ఏళ్ల కల అనీ, ఇప్పుడు సాకారమైనందుకు పరమానందంగా ఉందనీ సంబరపడింది.

హరియాణా రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఈ కామన్వెల్త్ క్రీడల్లో 53 కిలోల విభాగంలో ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో స్వర్ణపతకం సంపాదించింది. ఈ క్రీడల్లో ఈమెకు ఇది హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ కావడం చెప్పుకోవల్సిన విషయం. ఈ పతకాలు సాధించడానికి గత ఏడాది కాలంగా ఎలా సన్నద్దమయ్యిందో చెప్పుకుంటూ మురిసిపోయింది ఈ మల్లయోధురాలు.

ఈమెకు తోడుగా సీనియర్ రెజ్లర్ సాక్షి మాలిక్ 62 కిలోల ఫ్రీస్టైల్‌ ఈవెంట్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. గత రెండు కామన్వెల్త్ క్రీడల్లో రజత, కాంస్య పతకాలు సాధించిన ఆమె ఈ పసిడితో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసింది.

ఇక హర్యానా బాక్సింగ్ రాణి నీతూ ఘంఘాస్ 48 కిలోల విభాగంలో పోటీపడి పసిడిని పట్టి తన తండ్రి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. తన గెలుపును భారతీయులకు, తన గెలుపుకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చి, తనకు స్వయంగా శిక్షణనిచ్చి తనకు “ గబ్బర్ షేర్నీ ఆఫ్ ది రింగ్” అని పేరు తెచ్చిన తన తండ్రి జై భగవాన్‌కు అంకితం చేసింది.

ఇదే బాటలో మన హైదరాబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ కూడా  ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొన్న మొదటిసారే బంగారు పతకం సాధించి తన పంచ్ పవర్ నిరూపించింది.

ఇక మన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో పోటీపడి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మణిపూర్ మణిపూస వింధ్యారాణీదేవి కూడా 55 కిలోల విభాగంలో పోటీపడి రజత పతకం సాధించింది.

“శారీరక అవకరం కాదేమీ  ప్రతిభకు అనర్హం” అంటూ పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ బంగారు పతకాన్ని సాధించి మురిసిపోయింది. మనదేశంలో ఈ క్రీడలో స్వర్ణం సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.

సింగిల్‌గానే కాదండోయ్ మన అమ్మాయిలు గ్రూప్‌ క్రీడల్లో కూడా అదరగొట్టేసారు. ఈసారి కొత్తగా కామన్వెల్త్‌లో ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో భారత మహిళల టీమ్ అత్యద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరి ఆస్ట్రేలియాకి గట్టి పోటీగా నిలిచి రజత పతకాన్ని సాధించింది.

చాలామంది పేరు కూడా వినని లాన్ బౌల్స్ అనే ఆటలో వేర్వేరు వృత్తులు చేసుకునే నలుగురు అమ్మాయిలు అద్భుతంగా ఆడి ప్రధాని మోదీ ప్రశంసలు కూడా అందుకున్నారు. వారిపేర్లు లవ్లీ ఛౌబే, నయన్మోని సైకియా, రాణి తిర్కే, పింకీ. వీరు 92 ఏళ్ల కామన్వెల్త్ చరిత్రలో దేశానికి  ఈ క్రీడలో తొలిపతకం అందించారు.

మన దేశ జాతీయ క్రీడ హాకీలో 16 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం పాడింది మన భారత అమ్మాయిల హాకీ జట్టు. ఆఖరి 30 సెకన్లలో షూటౌట్ చేసి ఆటను తమవైపు తిప్పుకుని, న్యూజిలాండ్‌ను ఓడించి దేశ హాకీ చరిత్రను గుర్తుచేసారు. ఇదండీ కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల విజయగాథలు. మరి మనం వారిని మనస్ఫూర్తిగా అభినందిద్దామా…