Andhra PradeshNews

లోకేష్‌కు ఝలక్… టీడీపీకి గంజి చిరంజీవి గుడ్ బై

Share with

◆ నియోజకవర్గం స్థాయి నేతకు పొగ
◆ నారా లోకేష్‌పై విరుచుకుపడుతున్న నేతలు
◆ పద్మశాలి సామాజిక వర్గానికి చెక్
◆ వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం
◆ టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా
◆ మంగళగిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ

పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మీడియా ఎదుట గంజి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపిలో మున్సిపల్ చైర్మన్ గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించి నందుకు టీడీపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపిన ఆయన టిడిపి అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇన్ని సంవత్సరాలు తనకి అండగా ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఋణపడి ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. టిడిపిలో బీసిగా ఉన్న తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారని 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం అని తెలిపారు.

పదవులు కోసం, పరపతి కోసం టిడిపికి రాజీనామా చేయడం లేదనీ సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. టిడిపి వాళ్ళే తన రాజకీయ జీవితం నాశనం చేశారని చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు తనదే అని చెప్పి మోసం చేశారని ,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి మంగళగిరి ప్రజలకు దూరం చేశారని వివరించారు.చేనేత, బీసీ నేతగా ఉన్నందుకు అణగదొక్కారని,ఎస్సీ,ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తానని,అందరిని సంప్రదించి త్వరలోనే ఏ పార్టీలో చేరేది నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పారు.

గంజి చిరంజీవి రాజీనామాతో టిడిపికి మంగళగిరిలో పూర్తి ఎదురుదెబ్బ తగిలింది అని చెప్పుకోవాలి. బీసీలలో పద్మశాలీల ఓట్లు ఎక్కువ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో గెలుపోటముల నిర్ణయాధికారం ప్రతిసారి వారిదే. మొదటి నుండి టిడిపికి వెన్నంటి ఉన్న బీసీ సామాజిక వర్గాలు ముఖ్యంగా పద్మశాలీలు గంజి చిరంజీవి బయటకు రావడంతో మంగళగిరిలో కచ్చితంగా మరో మారు వైసిపి అభ్యర్థి గెలుస్తారని ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనదైన పనితనంతో అభివృద్ధి పనులను వేగవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో మరో బలమైన నేత మురుగుడు హనుమంతరావుకు వైయస్ జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టపెట్టి నియోజకవర్గంలో దృష్టి కేంద్రీకరించేలా చేశారు. ఇప్పుడు గంజి చిరంజీవి వైసీపీలో చేరబోతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. గంజి చిరంజీవి రాజీనామాతో… వైసీపీలో నూతన ఉత్సాహం ప్రారంభమైందని రాజకీయ పండితులు అంటున్నారు.

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోయే నారా లోకేష్ కు మరల ఎదురు దెబ్బ తగిలి ఓటమి చవిచూస్తారు అనే ప్రచారం నియోజకవర్గంలో ఇప్పటికే మొదలైంది. మరి ఈసారి ఎన్నికల్లో నారా లోకేష్ నియోజికవర్గం మారతారా మంగళగిరి నుండి పోటీ చేసి తన సత్తా చాటుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.