కేబినెట్ విస్తరణ.. మహారాష్ట్రలో మళ్లీ సంక్షోభం…
మహరాష్ట్రలో నూతన మంత్రి వర్గం కొలువుదీరింది. 18 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కేబినేట్ ప్రమాణస్వీకారం సమయంలో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నూతన కేబినెట్‌లోని శివసేన రెబల్ ఎమ్మెల్యే సంజయ్ రాథోడ్ వల్ల బీజేపీ శ్రేణుల్లో తీవ్ర స్ధాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి.
మహారాష్ట్ర మాజీ మంత్రి ఇప్పుడు కొత్త బీజేపీ-శివసేన మంత్రివర్గంలో చేరారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన శివసేన తిరుగుబాటు శాసనసభ్యుడు సంజయ్ రాథోడ్, టిక్‌టాక్ స్టార్‌తో సంబంధం నడిపి..ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అప్పుడు సంజయ్ రాథోడ్ కు శిక్షపడాలని బీజేపీనే గట్టిగా పోరాటం చేసింది. బీజేపీ ఒత్తిడితో సంజయ్ రాథోడ్ గత ఏడాది ఫిబ్రవరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు.
అయితే, కొత్తగా విస్తరించిన ఏక్‌నాథ్ షిండే-ఫడ్నవీస్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన 18 మంది ఎమ్మెల్యేలలో సంజయ్ రాథోడ్ ఉండడంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ లో ప్రత్యేకించి మహరాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా కిషోర్ వాగ్ తీవ్రంగా స్పందించారు. చిత్ర వాగ్ మాట్లాడుతూ.. ఓ మహరాష్ట్ర బిడ్డను పొట్టనబెట్టుకున్నా సంజయ్ రాథోడ్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని మండిపడ్డారు. అతనికి మళ్లీ మంత్రి పదవి దక్కడం దురదృష్టకరం అని రాథోడ్‌కు వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని చిత్ర వాగ్ ప్రకటించారు. రాథోడ్‌పై ఆరోపణలు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమర్థించారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత షిండే విలేకరులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాంలో విచారణ తర్వాత సంజయ్ రాథోడ్‌కు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారని అందుకే మంత్రిని చేశామని… ఎవరికైనా అభ్యంతరం ఉంటే చర్చిస్తామని వెల్లడించారు .