డీలిమిటేషన్‌తో సీట్లు పెరుగుతాయి: లక్ష్మణ్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో దేశాభివృద్ధి, సంస్కరణలకు సంబంధించిన కీలక అంశాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. ‘వికసిత్ భారత్– 2047’ లక్ష్యంతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, అభివృద్ధికి దోహదపడే బిల్లులను ఆమోదించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
డీలిమిటేషన్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు తగ్గవని, అవసరమైతే వాటి సంఖ్యను పెంచే అవకాశాలపై కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ అంశాలను ప్రతిపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు.
‘ఒకే దేశం– ఒకే ఎన్నిక’ విధానం దేశ ప్రయోజనాల కోసమేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక అనంతరం కీలక బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు కూడా సభా కార్యక్రమాలకు సహకరించాలని లక్ష్మణ్ కోరారు.

