Home Page SliderTelangana

డిసెంబర్ 3తో బీఆర్ఎస్‌కు మూడినట్టేనా?

Share with

మార్పుకు మూడో నెంబర్ శ్రీకారం చుడుతుందా?
అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కారు ఓటమి ఖాయమా?
గతంలో ఆరు నెంబర్ కలిసొచ్చిందన్న బీఆర్ఎస్
ఇప్పుడు మూడో నెంబర్‌తో ఆగమాగమవుతుందా?

నవంబర్‌లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెంబర్ ప్రతిష్టాత్మకంగా మారుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రక్రియ మూడో నెంబర్ చుట్టూ తిరుగుతోంది. గతంలో డిసెంబర్ 6న ఎన్నికలు జరగ్గా.. అది గులాబీ పార్టీకి కలిసొచ్చిందని, సీఎం కేసీఆర్‌కు సానుకూలమంటూ పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే తాజాగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కన్ఫ్యూజన్ తీసుకొస్తున్నాయ్. కంగారు పెట్టిస్తున్నాయ్. గతంలో ముందస్తుకు వెళ్లి కేసీఆర్ విజయం సాధించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఐదేళ్లు పూర్తయ్యాక ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. హ్యాట్రిక్ విజయాలు సాధించి, మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలని గులాబీ పార్టీ తహతహలాడుతుంటే… అసలు మూడో తారీఖు జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీని పుట్టి ముంచుతాయన్న చర్చ జోరందుకొంది.

వాస్తవానికి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ నెంబర్ 6 సెంటిమెంట్‌గా భావిస్తారు. అందుకే డిసెంబర్ 6న జరిగిన ఎన్నికలో విజయం సాధ్యమైందని అనుచరులు చెప్పుకుంటారు. ఐతే ఇప్పుడు మూడో తారీఖున ఎన్నికలు జరగనుండటంతో గులాబీకి ముళ్లు గుచ్చుకోవడం కన్ఫామ్ అన్న భావన వ్యక్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మూడో నెంబర్‌తో మొదలై… మూడో నెంబర్‌తో ముగుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదలవుతుండగా, నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. మొత్తంగా తెలంగాణ ప్రజలు ఈసారి కోరుకుంటున్న ప్రభుత్వం వస్తోందని గులాబీ పార్టీకి నెంబర్ 3 డేంజర్ సిగ్నల్స్ మోగించడం ఖాయమని సంఖ్యా శాస్త్ర నిపుణులు సైతం చెబుతున్నారు.