Home Page SliderNewsSportstelangana,

హైదరాబాద్‌కు వరుసగా ఐదో విజయం

హైదరాబాద్: టీజీ20 లీగ్- 2026లో హైదరాబాద్ ఈ- ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా ఐదో గెలుపును నమోదు చేసింది. ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన వరంగల్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ అమన్‌రావు 45, రిషికేత్ సిసోడియా 38 పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో అజయ్‌దేవ్ గౌడ్ 3 వికెట్లు తీసి ఆకట్టుకోగా, దేవ్ మెహతా, అఖిల్ రాథోడ్, షణ్ముఖి అశ్విన్, ప్రణవ్ వర్మ, అభిరథ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు కెప్టెన్ అభిరథ్ రెడ్డి అద్భుత ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించాడు. కేవలం 43 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు చేసి విధ్వంసకర సెంచరీ నమోదు చేశాడు. గడుగు గణేష్ 31 బంతుల్లో 50 పరుగులతో కీలక సహకారం అందించాడు.

వీరిద్దరి ధాటికి హైదరాబాద్ 15.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరంగల్ వారియర్స్‌కు ఐదు మ్యాచ్‌ల్లో ఇది నాలుగో ఓటమి కాగా, హైదరాబాద్ ఈ- ఛాంపియన్స్ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది.