ల్యాండింగ్ వేళ విమానాన్ని తాకిన డ్రోన్
అమెరికాలో ఓ ప్రయాణికుల విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఓ డ్రోన్ ఢీకొట్టింది.
లాస్ వెగాస్ నుంచి 159 మంది ప్రయాణికులతో వచ్చిన ఈ విమానం భూమికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో ఉండగా డ్రోన్ కాక్‌పిట్ వెలుపలి భాగాన్ని తాకింది. పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇవ్వగా, అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. అదృష్టవశాత్తూ విమానానికి పెద్దగా నష్టం జరగలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉండగా, విమానం క్షేమంగా ల్యాండ్ అయిందని జెట్‌బ్లూ యాజమాన్యం తెలిపింది.
ఈ ఘటనపై అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) దర్యాప్తు ప్రారంభించింది. విమానాశ్రయ పరిసరాల్లో డ్రోన్ల వినియోగం తీవ్ర భద్రతా ముప్పుగా మారుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. జేఎఫ్‌కే విమానాశ్రయం పరిసరాల్లో ప్రతి నెలా సుమారు 100 డ్రోన్లు గుర్తిస్తున్నామని వెల్లడించారు. నిషేధిత గగనతలంలో డ్రోన్లు ఎగరవేస్తే లైసెన్స్ రద్దుతో పాటు భారీ జరిమానాలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఏఏ హెచ్చరించింది.

