Andhra PradeshBreaking NewsHome Page SliderTrending Today

ఆక్వా రైతులను దెబ్బతీశారు: గొట్టిపాటి

అమరావతి: ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆరోపించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఆక్వా ప్రాంతాలను ‘ఆక్వా’, ‘నాన్‌ -ఆక్వా’ జోన్లుగా విభజించడం వల్ల వేలాది మంది రైతులు విద్యుత్ సబ్సిడీకి దూరమయ్యారని పేర్కొన్నారు. ఈ విధానం కారణంగా రైతులు గత ఐదేళ్లుగా తీవ్ర ఆర్థిక నష్టాలు చవిచూశారని అన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని సవరించి, అర్హులైన ఆక్వా రైతులందరికీ మళ్లీ విద్యుత్ సబ్సిడీ అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభించామని, అర్హులైన రైతులకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్ అందించే నిర్ణయం అమలు చేస్తున్నామని వెల్లడించారు.

వ్యవసాయ రైతులతో పాటు ఆక్వా రైతులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులకు కూడా విద్యుత్ రాయితీలు కొనసాగిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని జగన్‌కు సూచించిన ఆయన, అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.