Home Page SliderNewsNews AlertTelanganatelangana,Trending Today

కోర్టు విచారణకు హాజరైన అల్లు అర్జున్

‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోర్టు అనుమతితో వర్చువల్ (ఆన్‌లైన్) విధానంలో విచారణకు హాజరయ్యారు. గత విచారణలో ఆయన కోరిన మినహాయింపును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ అవకాశం కల్పించింది.

ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యం, ఇతర సిబ్బంది సహా మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిందితులందరికీ సుమారు 500 పేజీల ఛార్జ్‌షీట్ కాపీలను అందజేశారు.

2024 డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ సమర్పించారు.

ఛార్జ్‌షీట్ కాపీల పంపిణీ పూర్తవడంతో కేసు తదుపరి విచారణను జులై 29కు న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ కేసులో తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.