Breaking NewsInternationalNews

హర్మూజ్‌పై వీడని సస్పెన్స్

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయమై తామేమీ తొందరపడటం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ‘ట్రూత్‌ సోషల్‌’ సామాజిక మాధ్యమ వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో చర్చల ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తున్న అమెరికా అధికారులు తగినంత సమయం తీసుకోవాలని ఆయన సూచించారు. రెండు దేశాల మధ్య ఈ వ్యూహాత్మక ఒప్పందం పూర్తిగా ఒక కొలిక్కి వచ్చేవరకు హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ నౌకలపై విధించిన ఆర్థిక, సైనిక దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుందని ట్రంప్‌ తేల్చి చెప్పారు. ఇరాన్‌-అమెరికా ఒక ప్రాథమిక అవగాహన దిశగా ముందడుగు వేసినట్లు అంతర్జాతీయంగా విస్తృతంగా వార్తలు వస్తున్నప్పటికీ.. సదరు ఒప్పందం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడానికి ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని, దీనికి మరికొంత సమయం పడుతుందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇప్పటికే పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నాటి నుంచి దాదాపు 1,500 నుంచి 2,000 అంతర్జాతీయ సరకు రవాణా నౌకలు అక్కడే చిక్కుకుపోయి ఉన్నాయి. ఒకవేళ రెండు దేశాల చర్చలు సఫలమై అమెరికా తక్షణమే హర్మూజ్‌ జలసంధిని తెరిచినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల వల్ల ప్రపంచ షిప్పింగ్‌ రవాణా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడానికి చాలా కాలం పట్టొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు ఈ శాంతి ఒప్పందం దీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటుందని నమ్మిన తర్వాతే పూర్తిస్థాయిలో నౌకలను నడపడానికి మొగ్గు చూపుతాయి. దీనికి తోడు యుద్ధ సమయంలో సదరు జలసంధి మార్గంలో విస్తృతంగా అమర్చిన ప్రమాదకరమైన ‘సీమైన్స్‌’ పూర్తిగా తొలగించడానికి ఎంతకాలం పడుతుందనేది కూడా ప్రధాన సవాలుగా మారింది. అమెరికా సహా ఇతర మిత్రదేశాల నౌకాదళాలు తమ అధునాతన మైన్‌ స్వీపింగ్‌ నౌకలను ఈ పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో మోహరించడానికే చాలా సమయం పట్టొచ్చని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అక్కడ అంతర్జాతీయ చమురు ఎగుమతి ఆపరేషన్లు పూర్తిగా స్థిరపడటానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.