ఆ పింక్ డైమండ్‌కు రూ.480 కోట్ల ధర
జాతిరత్నాలలో వజ్రానికి ఉన్న విలువ ఇంక దేనికీ లేదు. అదీ కాక అది అరుదైన వజ్రమైతే దాని ధర ఆకాశాన్ని అంటుతుంది. గులాబీ రంగులో ధగధగా మెరిసిపోతున్న ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ను ప్రముఖ సంస్థ ‘సదబీస్’ శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేసింది. ఈ వేలంలో దీనికి కళ్లు చెదిరే ధర వచ్చింది. 58 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 480 కోట్ల రూపాయల ధర పలికింది. నిజానికి దీని అంచనా ధర 21 మిలియన్ డాలర్లు (173.5 కోట్ల రూపాయలు). కాగా దానికి రెట్టింపుకు మించి ధర వచ్చింది. ఇంత ధర 11.5 క్యారెట్లు ఉన్న ఈ వజ్రానికి పలకడం చాలా అరుదైన విషయం అని చెప్పొచ్చు.
ఇలాంటి గులాబీ రంగు వజ్రాలు ఇంకా రెండు ఉన్నాయి. 23.60 క్యారెట్ల మొదటి వజ్రాన్ని తన వివాహ వేడుకలో 1947లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకున్నారు. 59.60 క్యారెట్ల రెండవ పింక్ స్టార్ డైమండ్ 2017లో వేలం వేయగా దాదాపు 588 కోట్ల రూపాయల రికార్డు ధరకు అమ్ముడుపోయిందట.