బుడమేరు ఇంత ప్రమాదకరంగా ఎందుకు మారింది?
విజయవాడ ముంపుకు కారణం బుడమేరు కట్టలు తెంచుకుని ఊర్లోకి పోటెత్తడమే అన్న వాదన వినిపిస్తోంది. ఇన్నాళ్లలో ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు బుడమేరు ప్రమాదకరంగా మారింది? ఈ విషయంపై అధికార విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని ప్రజలు ఉత్సాహపడుతున్నారు. బుడమేరు వాగుకు 2005లో భారీ ఇన్‌ఫ్లో వచ్చింది. అప్పట్లో 70 వేల క్యూసెక్కుల నీరు రావడంతో విజయవాడ ముంపుకు గురయ్యింది. దీనిని పోలవరం ప్రాజెక్టుకు జతచేసి, కుడికాలువకు ఆ నీటిని మళ్లించారు. దీనితో బుడమేరు ప్రవాహం తగ్గుముఖం పట్టింది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో విజయవాడ, గుంటూరు మధ్య భూములకు రెక్కలొచ్చాయి. దీనితో బుడమేరు పరివాహక ప్రాంతం భారీగా ఆక్రమణలకు గురయ్యింది. వాగు ప్రదేశాన్ని కబ్జాలు చేసి, ప్లాట్లుగా మార్చారు. అయితే ఇప్పుడు భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీలో ప్రవాహం భారీగా ఉండడంతో కుడికాలువ కూడా నీటిని పైకి ఎగదోసింది. దీనితో బుడమేరుకు నీరు భారీ స్థాయిలో చేరుకుంది. దీనితో విజయవాడ పూర్తిగా ముంపుకు గురయ్యింది.
ఒకరకంగా కృష్ణానది కంటే బుడమేరు వరదలే బెజవాడకు ప్రమాదకరంగా మారాయి. ఈ ముంపుకు గురైన కాలనీలలో ఎక్కువశాతం బుడమేరు కట్ట లోపల నిర్మించిన అపార్ట్‌మెంట్లే ఉన్నాయి. ఆక్రమణలు తొలగించి, వాగు మలుపులు సరిచేయాలని, నీరు వెనక్కి ఎగదన్నకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో కూడా తెలంగాణ తరహా హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టాల్సిందేనని విమర్శలు చేస్తున్నారు. ఇంతటి బీభత్సానికి కారణమైన బుడమేరు మైలవరం కొండల్లో పుట్టింది. ఇది కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేస్తుంది. అరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలైన ఈ బుడమేరులో ఏడాది పొడవునా నీరుంటుంది. అనేక మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండడం వల్ల ప్రవాహం ఎక్కువయినప్పుడు కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. చుట్టుపక్కల ప్రాంతాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం ఈ వాగుకు గండి పడడంతో దేవీనగర్ పరిసర ప్రాంతాలలో ఉన్నఇళ్లలో నీరు చేరే అవకాశం ఉంది. రామవరపాడు, ప్రసాదంపాడు, ఏనికేపాడు, నిడమానూరు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.